విశాఖ…గాజువాక (పున్నమి ప్రతినిధి):
భారీ వాహనాల నుంచి ఎగిసిపడుతున్న బొగ్గు,దుమ్ము,దూళి కారణంగా జీవనం దుర్భరంగా మారిందని కర్నవాణిపాలెం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గంగవరం పోర్ట్‌కు చెందిన గంగవరం పోర్టు మరియు స్టీల్ ప్లాంట్ కు రోజువారీగా వెళ్తున్న భారీ ట్రక్కుల రాకపోకలతో గ్రామం మొత్తం కాలుష్య మబ్బులో కూరుకుపోతుందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో గ్రామస్తులు వై-జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్కులను అడ్డుకుని కొంతసేపు రాకపోకలను నిలిపివేశారు.ట్రక్కులకు కవర్లు లేకుండా బొగ్గు రవాణా చేయడం,అధిక వేగంతో దూసుకెళ్లడం వల్ల బొగ్గు కణాలు గాలిలో వ్యాపించి ఇళ్లలోకి చేరుతున్నాయని తెలిపారు.దీంతో చిన్నపిల్లలు,వృద్ధులు శ్వాసకోశ సమస్యలు,అలర్జీలు,కంటి ఇబ్బందులతో బాధపడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో ఇప్పటికే అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని,వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.వెంటనే రోడ్లపై నీటిచల్లి దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టాలని,బొగ్గు రవాణా వాహనాలకు కవర్లు తప్పనిసరి చేయాలని,గ్రామం గుండా కాకుండా ప్రత్యామ్నాయ మార్గం కల్పించాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు.సమస్యను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.అయితే తక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.



