*వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు – విశాఖపట్నం రేంజ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయులలో దేశభక్తి జ్వాలలు రగిలించిన ‘వందేమాతరం’ గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని, విశాఖపట్నం రేంజ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జెట్టి, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ రేంజ్ పోలీస్ కార్యాలయం ఆవరణలో గౌరవం వందనం ఇచ్చి, శ్రద్ధతో వందేమాతరం గీతాలపన చేసి, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు.
1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ గేయం తొలిసారిగా ఆయన రాసిన ప్రసిద్ధ నవల ‘ఆనంద్ మఠ్’లో ప్రచురితమైంది. అప్పటి నుండి ఇది భారతీయులలో జాతీయాభిమానానికి ప్రతీకగా నిలిచింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, డీఐజీ గారు దేశ స్వాతంత్య్రానికి ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవాలని, జాతీయ గీతాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఐజీ గారితో పాటు ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, మన్మధరావు, రేంజ్ కార్యాలయం మేనేజర్ బాల సూర్యారావు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


