పున్నమి ప్రతి నిధి
లక్ష్మీపురం లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు స్వయంగా పర్యవేక్షించారు. స్కూల్ నిర్మాణ దశలో ఉన్న భవనాలు, ప్రాంగణం, సదుపాయాల రూపకల్పనను పరిశీలించిన ఆయన అధికారుల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేసిన భట్టి విక్రమార్క, నాణ్యమైన మెటీరియల్ వాడాలని, విద్యార్థుల భద్రతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. స్కూల్‌ను అనుసంధానం చేసే రహదారుల పనులను వేగవంతం చేయాలని గుత్తేదారులకు ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచి, సమయానికి పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే అత్యంత విలువైన ఆస్తి. తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం,” అని తెలిపారు.
సదుపాయాల పరంగా రాష్ట్రంలో ఈ పాఠశాల ఆదర్శంగా నిలవాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కొత్త అవకాశాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


