*రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు*
రోడ్ సేఫ్టీ మీటింగులో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, హైవేలో జీబ్రా క్రాసింగ్ వద్ద సోలార్ బ్యాంకర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల వివరాలను, వారికి ప్రభుత్వం తరపున అందజేసిన వివరాలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గుర్తు తెలియని వాహనాల ద్వారా ప్రమాదానికి గురైన బాధితులకు అందుతున్న పరిహారం గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల గూర్చి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మేజర్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, పాఠశాల, కళాశాలల పరిసర ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయవలసిందిగా జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. రోడ్ల పై జీబ్రా మార్కింగ్, రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అవసరమైన చోట బస్ షెల్టర్ల ఏర్పాటుతో పాటు భారీ వాహనాలు నిలిపేందుకు ట్రక్-బేలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ పాత్ లు ఆక్రమణలకు గురి కాకుండా ప్రజలు వినియోగించుకునేలా పోలీస్, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన కూడళ్లతో పాటు అవసరమైన చోట సిసి కెమోరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు మధ్యలో ఉన్న చెట్ల వల్ల రోడ్లపై వాహనదారులకు లైటింగ్ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పోలీస్ కమిషనర్ పలు అంశాలపై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి ఆర్.సి.హెచ్. శ్రీనివాస్ గత సమావేశంలో చర్చించిన అంశాలను చేపట్టిన పురోగతిని సభ్యులకు వివరించారు.
కార్యక్రమంలో పోలీసు, వైద్యారోగ్య శాఖ అధికారులు, జీవీఎంసీ అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.


