రైల్వే కోడూరు, సెప్టెంబర్ 23: పున్నమి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10వ ఆయుర్వేదిక్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “ఆయుర్వేదం అనేది ప్రాచీన కాలం నుండి మన పూర్వీకుల ఆచారంలో భాగం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, దీర్ఘాయుష్షు పొందడంలో ఆయుర్వేదానికి అపారమైన ప్రాధాన్యం ఉంది” అని తెలిపారు. వృక్షశాస్త్ర ఉపన్యాసకుడు డాక్టర్ కె. రమేష్ గారు, “ఆయుర్వేదంలో ఉన్న రోగనిరోధక శక్తి ప్రభావం వల్ల శరీరానికి రక్షణ లభిస్తుంది” అని వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ, “మన పూర్వీకులు ఆయుర్వేదం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నారు, ఆయుష్షును పెంచుకున్నారు” అని అన్నారు. రసాయన శాస్త్ర ఉపన్యాసకుడు శ్రీ కె. పి. కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ, “వనమూలికల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వాటి ద్వారా రోగ నివారణ మాత్రమే కాక, శరీర బలపరచుకోవడం కూడా సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఆయుర్వేద దినోత్సవాన్ని అర్థవంతంగా జరిపారు.


