– ప్రభుత్వానికి ఏపీ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక డిమాండ్
– ఐదు మండలాల ప్రజలకు పరిపాలన చేరువ కావాలి: తుంగా లక్ష్మీనారాయణ
చిట్వేలు, జనవరి 1పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలుపుతూ ప్రత్యేకంగా రైల్వే కోడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ తుంగా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చిట్వేలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
-తిరుపతిలో కలపడం హర్షణీయం
రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం సముచితమైనదని ఆయన పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు బాలాజీ జిల్లాను ప్రతిపాదించినప్పుడే, కోడూరును అందులో కలపాలని ప్రజలు కోరుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
-దూరభారం తగ్గించడమే లక్ష్యం
ప్రస్తుతం కోడూరు, చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట మండలాలు రాజంపేట రెవెన్యూ డివిజన్ నుండి విడిపోయి తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరాయని, దీనివల్ల ప్రజలకు పరిపాలనాపరంగా దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదు మండలాల పరిధితో మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో, అదే తరహాలో రైల్వే కోడూరును కూడా డివిజన్‌గా ప్రకటించాలని కోరారు.ఐదు మండలాల ప్రజలకు రైల్వే కోడూరు కేంద్ర బిందువుగా ఉంటుందని, తద్వారా పరిపాలన సౌలభ్యంగా మారుతుందని సూచించారు.వెంటనే స్పందించి రైల్వే కోడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.


