Story highlights
- బియ్యం, ఉల్లిపాయలకు ‘నో స్టాక్’ బోర్డులు..
- ధరల పెరుగుదలతో సామాన్యుడి విలవిల ఆర్టీసీ కాంప్లెక్స్, గాంధీనగర్ బజార్లలో కదలని జిల్లా యంత్రాంగం..
- బ్లాక్ మార్కెట్ ముప్పు!
బియ్యం, ఉల్లిపాయలకు ‘నో స్టాక్’ బోర్డులు.. ధరల పెరుగుదలతో సామాన్యుడి విలవిల
ఆర్టీసీ కాంప్లెక్స్, గాంధీనగర్ బజార్లలో కదలని జిల్లా యంత్రాంగం.. బ్లాక్ మార్కెట్ ముప్పు!
ఆర్నాబ్ తుఫాను ముంచుకొస్తున్న వేళ కాకినాడ నగర ప్రజలపై నిత్యావసరాల ధరల భారం అమాంతం పెరిగింది. తుఫాను హెచ్చరికలతో అప్రమత్తమైన సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు,నిత్యావసరాల కోసం మార్కెట్లకు పోటెత్తడంతో నగరంలోని రైతు బజార్లు జనసంద్రంగా మారాయి. అయితే, ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను ఆకాశానికెత్తేస్తుండగా ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకులు అందక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కాకినాడ నగరంలోని ప్రధాన రైతు బజార్లైన ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బజార్, గాంధీనగర్ రైతు బజార్‌లలో ఉదయం నుంచే వినియోగదారుల రద్దీ విపరీతంగా పెరిగింది.తుఫాను ప్రభావంతో రవాణా నిలిచిపోతుందన్న ఆందోళనతో ప్రజలు పెద్దఎత్తున కొనుగోళ్లకు తరలివచ్చారు.
దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు కూరగాయల ధరలను రాత్రికి రాత్రే పెంచేశారు. బహిరంగ మార్కెట్లలో ధరల నియంత్రణ లేకపోగా రైతు బజార్లలోనూ రైతులకు బదులు దళారుల హవా కొనసాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేందుకు సబ్సిడీపై అందించే బియ్యం, రాయితీ ఉల్లిపాయల కౌంటర్లు వెలవెలబోతున్నాయి. మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులకు కౌంటర్ల వద్ద “నో స్టాక్” బోర్డులే దర్శనమిస్తున్నాయి.
అతి తక్కువ కోటా: ప్రభుత్వం నుంచి రైతు బజార్లకు అందుతున్న ఉల్లి, బియ్యం నిల్వలు ఏమాత్రం సరిపోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఉదయం గంటల వ్యవధిలోనే సరుకు అయిపోయిందని చెప్పి కౌంటర్లు మూసివేస్తుండటంతో, గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న మహిళలు, వృద్ధులు ఒట్టిచేతులతో వెనుదిరగాల్సి వస్తోంది.తుఫాను ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
రైతు బజార్లకు సరఫరా అవుతున్న సబ్సిడీ సరుకులను పక్కదారి పట్టించి, బయట ఎక్కువ ధరలకు విక్రయించే ముఠాలు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా యంత్రాంగం తక్షణమే తనిఖీలు చేపట్టకపోతే నిత్యావసరాలు పూర్తిగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయే ప్రమాదం పొంచి ఉంది.
విపత్తుల వేళ ప్రజలను ఆదుకోవాల్సిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు
ఆర్టీసీ కాంప్లెక్స్, గాంధీనగర్ రైతు బజార్లతో పాటు నగరంలోని ప్రధాన మార్కెట్లలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. తుఫాను ముప్పు తగ్గే వరకు సబ్సిడీ ఉల్లి, బియ్యం కోటాను పెంచి, నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి దుకాణం వద్ద రైతు బజార్ నిర్ణయించిన అధికారిక ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా చూడాలి, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
News Sources
- Punnami ReportingOwn reporting