పున్నమి ప్రతినిధి ,రామచంద్రపురం మండలం
రబీ సీజన్ 2026లో రైతులు సాగుచేసిన పంటలను ఈ క్రాఫ్ నమోదు వివరాలను తెలుసుకునేందుకు ఈ పంట సామాజిక తనిఖీ గ్రామ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారిని మమత అన్నారు. రైతు సేవ కేంద్ర ం లో ఈ పంట నమోదు చేసిన వివరాల జాబితాను సామాజిక తనిఖీ గ్రామ సభ లో భాగంగా ఆమె పరిశీలించారు. బుధవారం మండలంలోని గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామ సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో గ్రామసభలను నిర్వహించి, ఈ పంట యాప్ లో నమోదు చేసిన వివరాలను వెల్లడిస్తారని అన్నారు. ఏవైనా పంట నమోదులో మార్పులు ఉంటే సరి చేసుకునేందుకు సంబంధిత రైతు సేవ కేంద్రాల్లోని వి ఏఏల దృష్టికి తీసుకువచ్చి, గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని అందించేందుకు ఈనెల 16వ తేదీ వరకు గడువు ఉందని చెప్పారు. గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం పరిధిలో 155 మంది రైతులకు గాను 243 ఎకరాల్లో అన్ని పంటలకు సంబంధించిన వివరాలను ఈ క్రాఫ్ నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే సంబంధిత రైతు సేవ కేంద్రాలలో పంట నమోదు చేసిన రైతుల వివరాల జాబితాను నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భాగ్యలక్ష్మి రైతులు పాల్గొన్నారు.

