గూడూరు మే 25, 2020 ( పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : లాక్ డౌన్ సందర్భంగా కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా పరిగణించి పూర్తిగా ఆంక్షలు విధించిడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. అందులో భాగంగానే గూడూరులోని కోతరూం సందులో ఇటీవల కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో కంటైన్మెంట్ క్లస్టర్ గా నిర్ధారించి పూర్తి ఆంక్షలను విధించారు. ఆంక్షలతో పాటు అక్కడి నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వ అధికారులదే భాద్యత, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే అక్కడ నివసిస్తున్న వారిపై స్థానిక పోలీసులు బెదిరిస్తున్నారని, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆహార సమస్యలతో పాటు, రోగ గ్రస్తులకు అవసరమైన మందులు అందుబాటులో లేవని, వాటికోసం వెళ్ళడానికి అనుమతించడం లేదని పైపెచ్చు పోలీసు కానిస్టేబుళ్లు అవహేళనగా మాట్లాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి 5 రోజులైనా నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. చుట్టపు చూపుగా మున్సిపాలిటీ అధికారులు వచ్చి మీ పాట్లు మీరు పడండని, మీకివ్వడానికి మాదగ్గర ఏమి లేదని ఇక మీ ఖర్మ అంటూ చెప్పడం, అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా అక్కడి ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతం ఉపాది లేక రెండు నెలలుగా ఇళ్ళకే పరిమితమై ఉన్న ఈ సమయంలో, రెడ్ జోన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కనీసం చిన్న పిల్లలకు పాలు, రోగులకు మందులు తెచ్చుకోవడానికైనా అనుమతివ్వాలని వారు వేడుకోవడం శోచనీయం.