*రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి ఏటిగట్టు రోడ్డు*
పున్నమి ప్రతినిధి:
• నిధులు మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి అభ్యర్ధనకు తక్షణ స్పందన
• భక్తుల సౌకర్యార్ధం 7 కిలోమీటర్ల మేర ఏటిగట్టు రహదారి నిర్మాణం
కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. రూ.6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరతాయి. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాడపల్లి ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరున్న వాడపల్లి ఏడు వారాల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోందని, రావులపాలెం మీదుగా ఉన్న ప్రస్తుత రహదారి ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీతో భక్తులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. 216 జాతీయ రహదారి నుంచి ఏటిగట్టు మీదుగా 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి తక్షణం నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తే భక్తులు గోదావరి తీరాన ప్రయాణించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు చెప్పారు.


