*రూ.15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన బండి సంజయ్*
_*విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి*_ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున అందుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 21 మందికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.15.06 లక్షల విలువైన చెక్కులను శనివారం ఎం.వి.పి. కాలనీలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో ఆయన అందజేశారు. అనారోగ్యం ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఏయే సమస్యలకు ఈ సాయం అందుతుందనేది గంటా శ్రీనివాసరావును సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఆకస్మిక అనారోగ్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా ఆదుకుంటుందని గంటా తెలిపారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, కార్పొరేటర్ పి.వి. నరసింహం, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, జి. సుభాష్ చంద్రబోస్, గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


