విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి):
విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ —
కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్ర ఐటీ రంగానికి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకువచ్చినట్లే, ఇప్పుడు విశాఖలో గూగుల్‌తో ఒప్పందం కుదుర్చి నగరాన్ని గేమ్ ఛేంజర్‌గా మలుస్తున్నారని గణబాబు పేర్కొన్నారు. అలాగే, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళినప్పటికీ, గత 16 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, విజన్‌తో రూపొందించిన 26 కొత్త పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా భారీ పెట్టుబడులు ఆకర్షించబడ్డాయని తెలిపారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ వంటి సంస్థలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు — అనంతపురం, ఉత్తరాంధ్ర, అమరావతి ప్రాంతాల్లో — సుమారు ₹11 లక్షల కోట్ల పెట్టుబడులు, 9 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు.
రాబోయే కాలంలో మరో 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఐదు జిల్లాలకు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేయాలని కలెక్టర్లకు మంత్రి లోకేష్ ఆదేశించారని తెలిపారు.
కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, పలు సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు అవుతున్నాయని గణబాబు మీడియా ద్వారా తెలిపారు.
ఈ కార్యక్రమంలో 90వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ బొమ్మిడీ రమణ, టీడీపీ నాయకులు నరిపిన్ని సత్తిరాజు, యలమంచిలి ప్రసాద్, నరవ అనూష తదితరులు పాల్గొన్నారు.


