గాజువాక : డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
ప్రతిభవంతులైన నిరుద్యోగ యువతి-యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన సౌజన్యంతో గాజువాకలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘన విజయాన్ని సాధించిందని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల ప్రతిభను పరిశీలించి ఉద్యోగాలు కల్పించడంతో వెయ్యి మంది వరకు యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, టీడీపీ–జనసేన–బీజేపీ ప్రతినిధులు, టి.ఎస్.ఆర్ & టి.బి.కె కాలేజీ యాజమాన్యం, పోలీస్ మరియు జీవీఎంసీ అధికారులు, పాత్రికేయులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మెగా జాబ్ మేళా విజయవంతమైన నేపథ్యంలో గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి, కార్యక్రమానికి సహకరించిన సంస్థలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన యువతి-యువకులకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధాంత లక్ష్మి, 65వ వార్డు టీడీపీ అధ్యక్షులు రట్టి వాసు, గాజువాక నియోజకవర్గ టీడీపీ నాయకులు మొలకపల్లి పెంటయ్య, బుట్ట ప్రకాష్, శ్రీనివాస్ పట్నాయక్, వీయ్యపు అప్పలరాజు, గంగరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.


