ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు ధర్నా చేసి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు.
ఇందుకు ముందు, రైతులు కలెక్టర్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BKS ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేసి, జిల్లా వ్యాప్తంగా అన్ని క్లస్టర్ కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు.
జిల్లా అధ్యక్షుడు పగడవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ,
ఈ సంవత్సరం ఖమ్మం జిల్లాలో పత్తి–మిర్చి రైతులు భారీ నష్టాలకు గురై యాసంగిలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారని, అయితే ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే రూ.600–800 తక్కువగా ధర పలుకుతున్నందున రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రెండు లక్షల ఎకరాలకు పైగా సాగైన మొక్కజొన్నలో వేల టన్నులు ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జోన్ BKS నాయకులు మల్లెంపాటి రమేష్, మందనపు రామారావు, తాల్లూరి శ్రీనివాసరావు, కొండపర్తి నరేష్, తూము అప్పారావు, పొన్నగంటి వాణీపతి రావుతో పాటు నేలకొండపల్లి, కొనిజర్ల, ముదిగొండ, VM బంజర, కల్లూరు, వేంసూరు, కూసుమంచి, చింతకాని, కామేపల్లి మండలాల అధ్యక్షులు మరియు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.



