తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, నీటి కొరత సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి ఫిల్టర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చిట్వేల్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, ఫుడ్ బ్యాంక్, పాత వస్తువుల డొనేషన్ స్టాండ్ వంటి సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. అదే విధంగా మార్గోపల్లి, వెంకటరాజుపల్లి, నగిరిపాడు, తిమ్మాయపాలెం, కేఎస్ అగ్రహారం తదితర గ్రామాల నుండి సి.హెచ్.ఎస్ సభ్యులు, గ్రామస్తులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా త్రాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు. దీని కొనసాగింపుగా నేడు ఆయా గ్రామాలకు కూలింగ్ వాటర్ ఫ్రిజ్‌లను డెలివరీ చేయడం జరిగిందని, త్వరలోనే ఆర్వో ఫిల్టర్ల ఇన్‌స్టాలేషన్ కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, నిరుపేదలకు ఆపద సమయంలో చేయూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలను సి.హెచ్.ఎస్ సంస్థ నిరంతరంగా చేపడుతోందన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే వారు సభ్యత్వం తీసుకోవచ్చని, సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు.
మానవ జన్మ సార్థకత పుచ్చుకోవడంలో కాకుండా ఇచ్చుకోవడంలోనే ఉందని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సూర్యనారాయణ, బొంతల సతీష్, సంస్థ సభ్యులు ఎంవి నరసారెడ్డి, తిరుమల రెడ్డయ్య, అలిశెట్టి పెంచలయ్య, గాడి ఇంతియాజ్, బాలరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.



