పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 9 పనులకు శంకుస్థాపన చేయగా, వీటి అంచనా వ్యయం రూ.115 లక్షలుగా అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి సదుపాయాలతో గ్రామాల రూపురేఖలు మారతాయని, ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధితో పాటు శాశ్వత ఆస్తుల సృష్టి జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



