రైల్వే కోడూరు వాసి షేక్ మహమ్మద్ అజీమ్ మానవ హక్కుల రంగంలో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన “మానవ హక్కుల పరిరక్షకుడు అవార్డు”ను అందుకున్నారు.
ప్రతి ఏటా డిసెంబర్ 10న నిర్వహించే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర రాష్ట్రం ఔరంగాబాద్ నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ గౌరవం లభించింది.
ఈ కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారీ గారు షేక్ మహమ్మద్ అజీమ్‌కు అవార్డు మరియు కాంస్య పతకంను స్వయంగా అందజేశారు.
షేక్ మహమ్మద్ అజీమ్ గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, పేదలు–నిరుపేదలకు న్యాయం అందేలా పోరాటాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అవగాహన కార్యక్రమాలు, అవసరమైన వారికి చట్టపరమైన సహాయం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయడం గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ, “మానవ హక్కుల పరిరక్షణ అనేది ఒక్క వ్యక్తి పని కాదు, సమాజం మొత్తం బాధ్యత. ఈ అవార్డు నాకు మరింత ప్రేరణనిస్తూ ప్రజల కోసం ఇంకా సేవ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తోంది” అని తెలిపారు.
ఈ అవార్డు రైల్వే కోడూరు ప్రాంతానికి గర్వకారణమని స్థానికులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ షేక్ మహమ్మద్ అజీమ్‌కు అభినందనలు తెలిపారు.


