ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లిన కారు.. తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడిన స్పెషల్ ఎస్ఐ
లయన్స్ క్లబ్ ఆఫ్ నందలూరు, వాకర్స్ ఇంటర్నేషనల్ నందలూరు నుండి అభినందనలు
చిట్వేల్, డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి
విధి నిర్వహణలో మానవతా విలువలను ప్రదర్శించిన స్పెషల్ పోలీస్ ఎస్ఐ మన్నెం రామమోహన్ ఔదార్యం ప్రశంసలు అందుకుంటోంది. తిరుమల దర్శనం పూర్తి చేసుకుని కర్నూలుకు వెళ్తున్న శ్రవణ్ కుమార్ కుటుంబానికి చెందిన కారు ప్రమాదవశాత్తూ ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లగా, ఎస్ఐ సకాలంలో స్పందించి వారిని కాపాడారు.
ఆదివారం ఉదయం సుమారు 06:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శ్రవణ్ కుమార్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఒంటిమిట్ట చెరువు సమీపంలో అదుపుతప్పి నీటిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేరు.
సరిగ్గా అప్పుడే నందలూరు నుండి అదే రూట్‌లో వెళుతున్న స్పెషల్ పోలీస్ ఎస్ఐ మన్నెం రామమోహన్ కారును గమనించి తక్షణమే స్పందించారు. ఎస్ఐ మన్నెం రామమోహన్ ఒంటరిగా సాహసించి, ఆ రూట్‌లో వెళుతున్న ఇంకొక వ్యక్తి సహాయంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టారు.ఎస్ఐ చూపిన తెగువ కారణంగా చెరువులో నుండి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది.తదనంతరం, ఎస్ఐ మన్నెం రామమోహన్ వెంటనే ఒంటిమిట్ట సీఐ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, స్థానిక పోలీసులను రప్పించారు. ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తదుపరి అవసరాలను సమకూర్చడంలో ఎస్ఐ చూపిన చొరవ అభినందనీయం.ఎస్ఐ మన్నెం రామమోహన్ మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించి, ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను కాపాడటం ప్రశంసనీయమని స్థానిక ప్రముఖులు కొనియాడారు.లయన్స్ క్లబ్ ఆఫ్ నందలూరు మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ నందలూరు ఈ సందర్భంగా ఎస్ఐ మన్నెం రామమోహన్‌కు తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశాయి.


