మాధవదార గ్రామంలో సుమారు యాభై సంవత్సరాల క్రితం భక్తుల ఆరాధనతో వెలసిన గైరమ్మ తల్లి ఆలయం వద్ద నేడు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ప్రజలు, భక్తులు, పెద్దలు, మహిళలు ఆనందోత్సాహాలతో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.
ప్రతీ సంవత్సరం పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవాలు గత కొన్నేళ్లుగా పరిస్థితుల వల్ల నిర్వహించబడలేదు. కానీ ఈసారి గ్రామంలోని గైరమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, అమ్మలు ముందడుగు వేసి మళ్లీ ఉత్సవాలను పునరుద్ధరించారు. గ్రామ పెద్దల సహకారంతో, యువత స్ఫూర్తితో సనపల వెంకటరావు గారి గృహం వద్ద విశేషంగా ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల సందర్భంగా పూజారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కలశ స్థాపనలు నిర్వహించగా, గ్రామ పెద్దలు సనపల వర ప్రసాద్, సనపల వెంకటరావు వంటి ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఉదయం నుండి ప్రారంభమైన వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు సాంప్రదాయ వేషధారణలో తల్లిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో “జై గైరమ్మ” నినాదాలతో మార్మోగింది. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఉత్సవానికి ప్రత్యేక చైతన్యం తెచ్చారు.
ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ – “గైరమ్మ తల్లి మన గ్రామానికి ఆధ్యాత్మిక ఆత్మ, అమ్మ ఆశీర్వాదంతో ప్రతి ఇల్లు సుఖశాంతులతో నిండిపోవాలి అనే మనస్ఫూర్తి కోరికతో మళ్లీ ఉత్సవాలు ప్రారంభించాం” అని తెలిపారు.
సాయంత్రం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించబడింది. రాబోయే రోజులలో సాంస్కృతిక కార్యక్రమాలు, హరతుల సేవ, భజనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


