
వైఎస్ఆర్సీపీతో ఐదేళ్ల రాజకీయ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి శ్రీవారి పంచలోహాల విగ్రహాన్ని సమర్పించారు.
జగన్ నాయకత్వం ప్రజల గుండెల్లో మార్మోగుతుందని, ఆయనతో కలసి చేసిన రాజకీయ ప్రయాణం సంతృప్తినిచ్చిందని వాసుపల్లి అన్నారు. పేద విద్యార్థుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడం దురదృష్టకరమని విమర్శించారు.
చిరు వ్యాపారుల కోసం పోరాటం కొనసాగుతుంది
చిన్న వ్యాపారులపై అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన బడా బాబులను వదిలేసి హాకర్లను మాత్రమే వేధించడం తగదని వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. వీరికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ వెండర్లకు ప్రత్యేక హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి, నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

