మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో “శక్తి యాప్” వినియోగంపై పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఈ శక్తి యాప్ ప్రతి మహిళ తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించడం ద్వారా మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుంది. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయం అందిస్తారని ఎస్పి పేర్కొన్నారు.
జిల్లా ఎస్పి ఆదేశాలు మరియు అడిషనల్ ఎస్పి (అడ్మిన్) సూచనల మేరకు శక్తి బృందాలు జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ ప్రాంతాలు, విద్యాసంస్థలు తదితర ప్రదేశాల్లో ప్రజలకు, ముఖ్యంగా మహిళలు మరియు విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమాల్లో మహిళలకు శక్తి యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాలను వివరంగా తెలియజేస్తున్నారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే డయల్ 100, 112, 1098, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్ల గురించి కూడా ప్రజలకు తెలియజేస్తూ భద్రతపై జాగ్రత్తలు సూచిస్తున్నారు.
మహిళలందరూ తమ భద్రత కోసం శక్తి యాప్‌ను తప్పనిసరిగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని అవసర సమయంలో పోలీసుల సహాయం పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


