ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి@మహిళలకు సంక్షేమం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అందించే సంక్షేమం అందించటం కోసం, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఏదైనా సరే నేరుగా వారి వద్దకే చేరేలా శతవిధాల కృషి చేస్తోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. జీవనోపాధుల ప్రోత్సాహక విధానం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే డ్వాక్రా మహిళలకు రుణాలను సులభతరం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
డ్వాక్రా మహిళలకు సులభంగా రుణాలు
డ్వాక్రా మహిళలకు బ్యాంకు రుణాలను సులభంగా ఇచ్చేలా, వారు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన అనుమతులు కూడా సులభతరం చేసేలా నిర్ణయించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పోర్టల్ లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు సులభంగా రుణాలను పొందవచ్చు.
ఇప్పటివరకు డ్వాక్రా మహిళలు రుణాలు పొందాలంటే సంబంధిత డాక్యుమెంట్లతో బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి ఉండేది.
మహిళల స్వయం ఉపాధి యూనిట్స్ కోసం కొత్త విధానం
ప్రస్తుతం అటువంటి ఇబ్బంది లేకుండా మెప్మా ద్వారా ఆన్లైన్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి రుణాలను ఈజీగా పొందవచ్చు రాష్ట్రవ్యాప్తంగా 2.74 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండగా వారిలో చాలామంది ఇప్పటికే అనేక స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పి పని చేస్తున్నారు. ఇక మిగతా వారికి ఈ కొత్త విధానం ద్వారా సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
ఆన్ లైన్ పోర్టల్ లో లోన్ కోసం దరఖాస్తు
డ్వాక్రా మహిళలు మెప్మా పోర్టల్ లో ఉన్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించి తమకు నచ్చిన యూనిట్ ను ఎంచుకోవచ్చు. మెప్మా పోర్టల్ లో ఎల్ హెచ్ పి సెల్ పైన క్లిక్ చేసి తమకు నచ్చిన, తాము పని చెయ్యాలి అనుకుంటున్న యూనిట్ కోసం బ్యాంకు రుణం కోసం ఆన్లైన్ లోనే పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. తమ పూర్తి వివరాలను సబ్మిట్ చేయాలి. అప్పుడు రుణం కోసం ప్రాసెస్ మొదలవుతుంది.
బ్యాంకుల ద్వారా 50 వేల నుండి 2 లక్షల వరకు రుణాలు
మెప్మా రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు దరఖాస్తులను పరిశీలించి అర్హతలను చూస్తారు. యూనిట్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవుతుంది? ఆదాయం ఎంత వస్తుంది? వంటి వివరాలన్నింటినీ పరిశీలించి అర్హత ఉంటే బ్యాంకులకు ప్రతిపాదిస్తారు. ఆపై బ్యాంకులు 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు లోన్ లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేసిన యూనిట్ ను ఏడాది పాటు అధికారులు పర్యవేక్షిస్తారు.


