పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
ఖమ్మం జిల్లా
మధిర పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు కలెక్టర్ మధిర మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్, ముస్లిం కాలనీలలో వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి, వర్షకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరంగా తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నాణ్యతతో సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ప్రభావాన్ని తగ్గించేందుకు సంరక్షణ కాల్వర్టర్లు మరియు స్టామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు.
అలాగే, పట్టణంలోని చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్‌కు తరలించి రహదారుల వెంట చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
తదనంతరం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్&బీ, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, పట్టణ అభివృద్ధి పనులు మరియు వరద నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ డిఇ నాగబ్రహ్మం, ఆర్&బీ డిఇ శంకర్, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు.


