ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
, జిల్లా ఇంచార్జి)
ఖమ్మం జిల్లాలో ఖమ్మం తరువాత అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందిన మధిర రైల్వే స్టేషన్‌ను ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధి నుండి కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోకి చేర్చే చర్యలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మార్పు అమలైతే మధిర రైల్వే ఆదాయం తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు మళ్లే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
ప్రస్తుతం మధిర స్టేషన్ నుండి రోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు రైలు ప్రయాణం చేస్తున్నారు. మధిర పరిధిలోని రైల్వే టికెట్ విక్రయాలు, సరుకు రవాణా ఆదాయం తెలంగాణ రాష్ట్ర ఖాతాలోకి వస్తోంది. అయితే స్టేషన్‌ను విజయవాడ డివిజన్‌కు చేర్చితే ఆ ఆదాయం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రైల్వే పరంగా మధిర సెక్షన్ పరిధి దెందుకూరు–మధిర మధ్య నుంచి పందిళ్లపల్లి–ఖమ్మం మధ్య వరకు ఉంటుంది. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం కొండపల్లి నుంచి మోటమర్రి వరకు ఉన్న సుమారు 8 కిలోమీటర్ల భాగాన్ని ఆధారంగా తీసుకొని మొత్తం మధిర స్టేషన్‌ను విజయవాడ డివిజన్ పరిధిలోకి మార్చే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం 8 కిలోమీటర్ల పరిమితి ఆధారంగా ఒక కీలక స్టేషన్‌ను ఇతర జోన్‌కు చేర్చడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
ప్రస్తుతం పద్మావతి, కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తూ మధిరలో ఆగుతున్నాయి. అయితే విజయవాడ నుంచి ఖమ్మం దిశగా వచ్చే సమయంలో ఆగకపోవడం ఇప్పటికే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. భవిష్యత్తులో మధిర స్టేషన్ పూర్తిగా విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్తే, రైళ్ల ఆగుదల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధిరలో నివసిస్తున్న ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ భూభాగంలో ఉన్న స్టేషన్‌ను ఇతర రాష్ట్ర పరిధిలోకి మార్చే నిర్ణయం స్థానిక ఆర్థిక వ్యవస్థపై, ఉద్యోగ అవకాశాలపై, అభివృద్ధిపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
ఖమ్మం తర్వాత ప్రాధాన్యత కలిగిన రైల్వే స్టేషన్‌గా నిలిచిన మధిర భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదాయం, రైళ్ల ఆగుదల, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
మధిర రైల్వే స్టేషన్‌ను తెలంగాణ పరిధిలోనే కొనసాగించాలన్నది స్థానికుల ఆకాంక్షగా స్పష్టంగా కనిపిస్తోంది.


