స్టేడియంలో మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించిన ఐసిసి ఛైర్మన్ జైషా, బిసిసిఐ ప్రతినిధులు
స్మృతి మంధనకు అభినందనలు తెలిపిన ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్
మహిళా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచుల్లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా, బిసిసిఐ ప్రతినిధుల తో కలిసి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు తిలకించారు. మహిళ క్రికెట్ మ్యాచ్ కు అభిమానుల నుంచి వచ్చిన స్పందనపై నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా మ్యాచులు తరుచుగా జరిగినట్లు అయితే మహిళ క్రికెట్ కు మరింత ఆదరణ పెరిగే అవకాశం వుందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తో అన్నారు. ఇందుకు తన సహకారం అందిస్తానని చెప్పారు. ఇండియా బ్యాటింగ్ సమయంలో స్టార్ మహిళ బ్యాటర్ స్మృతి మంధాన, ప్రతికా కొట్టిన ఫోర్లు, సిక్సర్లకు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు తో పాటు మంత్రి నారా లోకేష్ సైతం చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్ గా ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కి ఏసీఏ తరుఫున ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు.


