అన్నమయ్య జిల్లా, పుల్లంపేట – సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
పుల్లంపేట మండలం కేతరాజుపల్లి పంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 206లో ప్రభుత్వం భూమిని రాత్రిపూట జెసిబి యంత్రాలతో సదులు చేస్తూ అక్రమంగా ఆక్రమిస్తున్న భూబకాసురులను వెంటనే అరెస్టు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య డిమాండ్ చేశారు.ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో కబ్జాలకు గురైన భూములను పరిశీలించిన అనంతరం పుల్లంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, తహసీల్దార్ పుల్లారెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాజు బోయిన సెల్వన్ కుమార్, కేతరాజుపల్లి, ఉడుమువారిపల్లి ఎస్సీ కాలనీల వాసులు పాల్గొన్నారు.జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ, “రెవెన్యూ యంత్రాంగం కళ్ళు మూసుకుని కబ్జాదారుల ఆటవిక చర్యలను చూడనట్లు వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకుల అండదండలతో భూబకాసురులు రాత్రిపూట జెసిబిలు పెట్టి చెట్లు నరికేస్తూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరచి భూకబ్జాదారులపై కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలి” అని హెచ్చరించారు.అలాగే ఆయన, కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఎనిమిదో విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉడుమువారిపల్లి, కేతరాజుపల్లి ఎస్సీ కాలనీల్లో ఒక్కింట్లో నలుగురు–ముగ్గురు కుటుంబాలు ఉంటున్నందున వెంటనే ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్‌కి కోరారు.తహసీల్దార్ పుల్లారెడ్డి స్పందిస్తూ, “ఇంటి స్థలాలు లేని అర్హులైన వారికి తప్పక రెవెన్యూ పరంగా పట్టాలు మంజూరు చేస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు కాని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు.


