ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను బీజేపీ జాతీయ నేత, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఖమ్మం చేరుకున్న ఆయనకు బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద సాధర స్వాగతం పలికారు.
వెలుగుమట్లకు చేరుకున్న ఈటెల రాజేందర్ బాధితుల సమస్యలను స్వయంగా తెలుసుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ — మొత్తం 62 ఎకరాల భూదాన్ భూములు ఉండగా ప్రభుత్వం కేవలం 30 ఎకరాలను మాత్రమే గుర్తించి పేదలను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించడం దారుణమని విమర్శించారు.
మిగిలిన 32 ఎకరాల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో జరుగుతున్న చర్యలు ఇక్కడ కూడా అమలు చేస్తున్నారని ఆరోపించారు. లేని వారి దగ్గర గుంజి ఉన్నవారికి ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్లో నివసిస్తున్న బాధితులకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్, ఆయన సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవికుమార్, ధనియాకుల వెంకట్ నారాయణ, రుద్రగాని మాధవ్, రామకృష్ణ, నాగేశ్వరావు, మిర్యాల రామకృష్ణ, మధునాయక్, భూక్యా శ్యాం తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


