భారీ వర్షాలు పొంచి ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
* సహాయక చర్యలకు జీవీఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం రాబోయే కొన్ని రోజుల్లో విశాఖపట్నం తీరప్రాంతాలను తాకే అవకాశం ఉన్నందున, నగరంలో భారీ వర్షాలు పొంచి ఉన్నకారణంగా నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయక చర్యలు దిశగా జీవీఎంసీలో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
భారీ వర్షాలు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి మూడు షిఫ్టులలో 25వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు సహాయక చర్యలకు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసి అందుబాటులో ఉంచామన్నారు. అలాగే అన్ని జోనల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ లను, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
కావున విశాఖ నగరంలో గల కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,
వర్షం, గాలివాన సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, ప్రకటనల బోర్డులు క్రింద, శిధిలావస్థలోనున్న పాత భవనాలలో ప్రజలు ఉండరాదన్నారు. వర్షాలు సమయంలో ఎటువంటి ప్రమాదాలు నగర పరిధిలో జరిగినట్లయితే ప్రజలు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0891-2507225 లేదా జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ 1800-425-0009 నంబర్ కు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సేవలకు సంబంధించి జీవీఎంసీ కంట్రోల్ రూమ్ 24 గంటలూ సిద్ధంగా ఉంటుందన్నారు.
కావున ప్రజలు, వ్యాపారస్తులు కాలువలలో వ్యర్ధాలు పార వేయకుండా వర్షపు నీరు సునాయాసంగా పారేలా చూసుకోవాలన్నారు. అనధికారిక ప్రకటనలు, సామాజిక మాధ్యమాలలో వచ్చే తప్పుడు సమాచారం నమ్మకుండా అధికారిక ప్రకటనలనే విశ్వసించాలన్నారు.
“పౌరుల భద్రతే ప్రాధాన్యంగా వర్షాలు తీవ్రతను బట్టి రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తామని కమిషనర్ తెలిపారు.


