దోచుకోవటానికి సిద్ధంగా ఉన్న మద్యం సిండికేట్
భద్రాచలానికి మద్యం పాలసీ వద్దంటున్న ప్రజలు
పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్
02-11-2025, భద్రాచలం
బార్లు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
మద్యం దుకాణాలు అభివృద్ధికి ఆటంకాలు
నిండు ప్రాణాలు బలిగొంటున్న మద్యం మహమ్మారి
నోరు మెత పని ప్రధాన రాజకీయ నాయకులు
తాగిన మత్తులో అలజడి సృష్టిస్తున్న గ్యాంగ్ వార్లు
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం టెండర్లను రద్దు చేయాలని భద్రాచలానికి మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వద్దని భద్రాచలం పట్టణ ప్రజలు ముక్తకంఠంతో గళ మెత్తుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గత మద్యం పాలసీ వలన యువకులు మద్యం తాగి గ్యాంగ్ వార్లకు ప్రధాన కారణం మద్యం మహమ్మారి అవుతుంది. మద్యం దుకాణాలు అలాగే గల్లీకో బెల్ట్ షాపు ఏర్పాటు చేయడం వలన వీధి వీధినా యువకులు, విద్యార్థులు గొడవలు, కొట్లాటలు నిత్యం భద్రాచలం ప్రాంతంలో అలజడ్లకు కేంద్రంగా మారింది. అలాగే యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వలన అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. తాగిన మత్తులో కత్తులతో దాడులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈమధ్య దుకాణదారులు సిండికేట్ గా ఏర్పడి ఎక్కడబడితే అక్కడ మద్యాన్ని ఏరులై పారించటం డబ్బుల వ్యామోహంలో చట్టాన్ని కూడా తమ చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలను చేపడుతున్నారు విద్యార్థులు కూడా మద్యానికి బానిసై చదువులు మధ్యలోనే ఆపే పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో చోటుచేసుకుంది మద్యం లైసెన్స్ దారులు బినామీలుగా మారటం వలన అగ్రవర్ణ బడా వ్యాపారస్తులు ఇదే అదునుగా భావించి లైసెన్సును కొనుగోలు చేసుకుని వారికి నచ్చిన విధంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వలన ఈ ప్రాంతంలో భారీ నష్టం చోటు చేసుకుంటుంది. నిత్యం ప్రజలు భయం గుప్పెట్లో బ్రతికే పరిస్థితి కనిపిస్తుంది. ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఎక్కడ ఏ వార్త వినాల్సి వస్తుందోనని అనుక్షణం ఒక గండం గా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతం రాముడు సంచరించిన ప్రాంతంగా చెప్పబడుతుంది. కానీ ఈ ప్రాంతంలో మద్యం సిండికేట్ చీకటి వ్యాపారం వలన ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత కోల్పోవడం చాలా బాధాకరంగా చెప్పవచ్చు అందుకనే భద్రాచలం ప్రాంతాన్ని మద్యం పాలసీ నుండి ఉపసంహరించాలని ఈ ప్రాంతానికి ఉన్న పేరు ప్రతిష్టను కాపాడే బాధ్యత అధికారుల పైన ఉందని స్థానిక ప్రజలు వారి వాదనను వినిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పునర ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆధ్యాత్మిక భావంతో ఈ ప్రాంతం విరాజుల్లుతుందని కానీ ఈ మద్యం బారినపడిన యువకుల వలన అనేక అనర్థాలకు దారితీస్తుందని ప్రజానీకం వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సంఘటనలు జరుగుతున్నప్పుడల్లా స్టేషన్లో పెట్టి కేసులు బనాయించడం మరల వాళ్లు బయటకి రావడం పరిపాటిగా మారిందని సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని ప్రజలు ఈ ప్రాంత క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం టెండర్ల ప్రక్రియను భద్రాచలానికి మినహాయించి భద్రాచలం ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.


