ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నగరంలోని 21వ డివిజన్ పార్శి బంధం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ గల్లా సత్యనారాయణ, శ్రీమతి శరణ్య దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారు శ్రీ సీతారాముల వారి ఆశీర్వాదాలు తీసుకుని, ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు పిల్లలమర్రి వెంకట్, డీకొండ శ్యామ్ సుందర్ పాల్గొని ఉత్సవాలకు సహకరించారు. అలాగే శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భక్తుల రద్దీతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. భజనలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చివరగా అన్నదానం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.


