ప్రైవేటు ఆసుపత్రులకు పెరిగిన రోగుల తాకిడి – వైద్య సేవలు ఎప్పుడంటూ ప్రజల ఎదురుచూపులు
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు: బోగోలు మండలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. మండలంలో 16 గ్రామ పంచాయతీలు, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రారంభోత్సవం జరిగి నెలలు గడుస్తున్నా.. తెరుచుకోని క్లినిక్!
బోగోలు–3 విలేజ్ హెల్త్ క్లినిక్‌ను గత అక్టోబర్ 6న ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. భవనం సిద్ధంగా ఉన్నా క్లినిక్ పనిచేయకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై కోవూరుపల్లి వైద్యాధికారిని వివరణ కోరగా, ఇది తమ పరిధిలో లేదని, నెల్లూరులోని జిల్లా వైద్యాధికారిని అడగాలని సమాధానమిచ్చారు.
అధికారులు, ఎమ్మెల్యే స్పందించాలి!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి బోగోలు–3 విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


News Sources
- Punnami ReportingOwn reporting