కొత్తగూడెం జనవరి
(పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు నూనె హనుమంతరావు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గపోరుతో విసిగి వేసారి పోయిన ఆయన ఆదివారం అధికారికంగా తన రాజీనామాను ప్రకటించారు.
గతంలో కూడా పార్టీలో నెలకొన్న వర్గ పోరుల కారణంగా హనుమంతరావు ఒకసారి బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం వర్గ విభేదాలు తగ్గాయని భావించి తిరిగి పార్టీలో చేరి క్రియాశీలంగా పని చేశారు. అయితే, మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఇక పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి కొత్తగూడెం జిల్లా పర్యటన నేపథ్యంలో హనుమంతరావు రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో బీజేపీ అంతర్గత పరిస్థితులపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



