- రాష్ట్రంలో బిసిల అభ్యున్నతికి పాటుపడతామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బిసి/ ఓబిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ వందేళ్ల కిందట దేశంలో అణగారిన వర్గాల, పేద ప్రజల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారన్నారు. పూలే ను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టారని, ఎన్నో రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు అండగా నిలిచారన్నారు. ఆయన బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. చేపట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ సోదరుల కు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించారని, అమ్మ ఒడి, పెన్షన్లులాంటి పథకాలను ప్రవేశపెట్టారని, టైలర్ లు, నాయి బ్రాహ్మణుల కు ఆర్థిక సాయం చేశారని, 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించగా అందులో బి సి, ఎస్సీ, ఎస్ టిలకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇచ్చారన్నారు. జిల్లాలో బిసి భవన్ నిర్మాణానికి, బిసిలకు రుణాల మంజూరుకు, బిసి స్టడీ సర్కిల్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిసీలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ పూలే ను ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు అంతా తమ పిల్లలను బాగా చదివించాలని, విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందేలా తోడ్పాటు అందించాలన్నారు. విద్యార్థులు ఆత్మన్యూనతా భావానికి లోను కాకుండా చిన్నప్పటినుంచే ధైర్యాన్ని నూరిపోయాలని, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి ల అభివృద్ధికి పాటు పడుతోందని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారికోసం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు పూలే ప్రతిభా అవార్డులను మంత్రి, ఎంపీలు ప్రధానం చేశారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ వీరాంజనేయులు, జడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్, బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పిడుగు శ్రీనివాసులు, బిసి సంఘం నాయకులు, విద్యార్థుని, విద్యార్థులు పాల్గొన్నారు.