ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్
తెలంగాణకు యూరియా సరఫరాపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచందర్ రావు వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని తెలంగాణకే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందనడం అవివేకం అన్నారు. రామచందర్ రావు వ్యాఖ్యలు బీజేపీకి రైతులపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు వద్దని ఎన్నిసార్లు కోరినా రామచందర్ రావు వైఖరి మారడం లేదన్నారు.
రాజీనామా సవాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తే బాగుంటుందని సెటైర్ వేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం గొప్పు లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు రైతులను తప్పుదారి పట్టించడం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితిపై లెక్కలతో సహా కేంద్రానికి లేఖ రాశానని చెప్పారు.
కాగా రాష్ట్రంలో సరిపడి యూరియా స్టాక్ ఉందని అయినా ఎరువుల కొరత ఎందుకు ఉందని ఇటీవల రామచందర్ రావు ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లోకి యూరియా వెళ్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పందించిన తుమ్మల రామచందర్ రావుపై అసహనం వ్యక్తం చేశారు.