పవన్ కళ్యాణ్ ఎంత అభివృద్ధి చేశారో చూపిస్తాం : జనసేన నాయకుడు డాక్టర్ బి.ఎన్.రాజు
పిఠాపురం : నియోజవర్గంలోని జనసేన నాయకుడు డాక్టర్ బి.ఎన్.రాజు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళల పట్ల ఎనలేని గౌరవం ఉందని, మహిళలందరూ పవన్ కళ్యాణ్ను సొంత అన్నగా, ఆపద్బాంధవుడిగా చూస్తారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్న జన సైనికులమైన తామంతా ఎదుటివారిని గౌరవించి మాట్లాడతాం అని, బొజ్జా ఐశ్వర్య ఒక మహిళ అయి ఉండి తమ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ లను ఏక వచనంతో సంబోధిస్తూ, కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. తమ నాయకులను మీరు కించపరిచే విధంగా మాట్లాడడం జనసైనికులను ఆవేదనకు గురిచేసిందన్నారు. అందుకే బొజ్జా ఐశ్వర్య పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరడం జరిగిందని, అదే సందర్భంలో పిఠాపురం నియోజవర్గ అభివృద్ధిని చూసి మాట్లాడాలని మీడియా ముఖంగా మర్యాదపూర్వకంగా కోరుతున్నామన్నారు. కానీ మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా మరొక వీడియోను విడుదల చేస్తూ తమ నాయకులను ఏక వచనంతో సంబోధిస్తూ మరొకసారి నోరు పారేసుకోవడం సమంజసంకాదన్నారు. బొజ్జా ఐశ్వర్య విడుదల చేసిన వీడియో గురించి తమకు తెలియనిది కాదని, పాత వీడియోలన్నీ తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి బురద జల్లే ప్రయత్నం చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 13 నెలల కాలంలోనే పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో సుమారు రూ.308 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో నియోజకవర్గంలో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. ఇలా వీడియోలు విడుదల చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేసి మొరిగినంత మాత్రాన తమ నాయకుల విలువ ఏమీ తగ్గిపోదు అని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఎక్కడో ఉండి వీడియోలు విడుదల చేయడం కాదని, సవాల్ విసురుతున్నాం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. నోటి మాటతో మీరు బురద జల్లడం కాదు మీరు బహిరంగ చర్చకు వస్తే ఆధారాలతో సహా చూపిస్తామని, తమ నాయకులు పవన్ కళ్యాణ్ జనసైనికులందరికీ గౌరవించడం నేర్పారు కాబట్టే మీకు ఇంత గౌరవించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోవాలన్నారు.


