*బలవంతపు భూసేకరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలు.రైతు, కూలీల బ్రతుకుల బుగ్గిపాలు*
విజయవాడ , సెప్టెంబర్ 24, ( పున్నమి ప్రతినిధి)
అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసేకరణ, (అక్విజిషన్)/ సమీకరణ (పూలింగ్) సాగుతున్నది. సాగు భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమే అభివృద్ధిగా పాలకులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సేకరించిన భూముల్లో ఎన్ని పరిశ్రమలు పెట్టారు ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత అభివృద్ధి జరిగింది, తదితర వివరాల్ని ప్రభుత్వం బహిరంగపర్చకుండా గుట్టుగా ఉంటున్నది. దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని సిపిఐ(యం) సహా వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు పదే పదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. అత్యధిక భూములు రియల్ ఎస్టేట్ గానో, మనీ లాండరింగ్కు సాధనంగానో మారిపోతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు దీనిని కామధేనులాగా వాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తూ అధికారం చేపట్టగానే అదే విధానాలను అమలు చేస్తున్నారు. గతంలో వైసిపి, ప్రస్తుతం టిడిపి కూటమికి ఇందులో తేడా లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వీరికి దన్నుగా ఉంటుధని తెలియజేశారు.
బలవంతపు భూసేకరణవల్ల అభివృద్ధి జరక్కపోగా దీనివల్ల లక్షలాది రైతులు, కూలీలు, వృత్తిదారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆహారధాన్యాల కొరత రానున్నది. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అనవసరపు భూసేకరణ యత్నాలను విరమించుకోవాలి.


