విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విశాఖ జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో, 13 అక్టోబర్ 2025 న వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు అనుకోకుండా బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులోకి ప్రవేశించడంతో, ఆ దేశ కోస్ట్ గార్డు సిబ్బంది వారిని 22 అక్టోబర్ తెల్లవారుజామున 2 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.
మత్స్యకారుల కుటుంబ సభ్యులకు సాయంత్రం ఈ సమాచారం తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన విజయశంకర్ ఫణి, బీజేపీ ధార్మిక సెల్ నాయకుడు, మత్స్యకారుల నాయకులతో కలిసి స్థానిక ఎంపీ భరత్ ని కలుసుకున్నారు.
తరువాత ఈ సంఘటన వివరాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ కి మరియు జనసేన పార్టీ నాయకుడు పంచకర్ల సందీప్ కి ఫోన్ ద్వారా తెలియజేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విజయశంకర్ ఫణి మాట్లాడుతూ,
“మన మత్స్యకారులు కేవలం వేటకు వెళ్లి అనుకోకుండా సరిహద్దు దాటారు. వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు బంగ్లాదేశ్ అధికారుల నుండి ఎటువంటి అధికారిక సమాచారం భారతదేశానికి అందలేదు,” అని తెలిపారు.
ప్రస్తుతం మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ అధికారుల సహాయం కోసం వేడుకుంటున్నారు. తీర ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.


