పున్నమి ప్రతినిధి:
*రూ.1.30 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి ధర*
*ఇవాళ ఒక్కరోజే రూ.9,700 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర*
దేశంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇవాళ (సోమవారం) ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ.9,700కు పైగా పెరిగింది. దీనితో ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. మరోవైపు వెండి ధరలు కూడా ఆల్టైమ్ రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇవాళ కిలో వెండి ధర ఏకంగా రూ.7,400 పెరిగి రూ.1,57,400కు చేరింది.
అమెరికా షట్డౌన్ కావడం సహా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాలే ఇందుకు కారణం. వీటికి తోడు అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ టారిఫ్లు, కేంద్రీయ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కలగలిసి బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.
*నగరాల వారీగా నేటి బంగారం ధరలు:*
ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.30 లక్షలు.
హైదరాబాద్లో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,26,674గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,16,117.
విజయవాడలో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,26,674గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,16,117.
విశాఖపట్నంలో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,26,674గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,16,117.
ముంబయిలో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,20,770గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,10,770.
వీటికి తోడు కొనుగోలుదారులు జీఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
*అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు:*
ఇంటర్నేషనల్ మార్కెట్లో సోమవారం ఔన్స్ బంగారం ధర 3,900 డాలర్లు దాటింది. యూఎస్లో స్పాట్ గోల్డ్ ధర ఆల్టైమ్ రికార్డ్ హై 3,924.39 డాలర్లకు పెరిగి, తరువాత 3,922 డాలర్ల వద్ద స్థిరపడింది. మొత్తంగా చూసుకుంటే, గత కొన్ని నెలలో బంగారం ధర 50 శాతం మేర పెరిగింది. అంతేకాదు ఇకపై కూడా పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఔన్స్ బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి ఏకంగా 4,800 డాలర్లకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే బంగారం ధర 26 శాతానికిపైగా పెరిగే ఛాన్స్ ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
*తగ్గుతున్న గోల్డ్ బిజినెస్:*
బంగారం ధరలు ప్రతిరోజు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం కొనేందుకు వెనుకాడుతున్నారని, ఫలితంగా క్రయవిక్రయాలు బాగా తగ్గున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. పసిడి రేట్లు పెరుగుతుండడంతో మహిళలు ఇతర ఆభరణాల వైపు మళ్లుతున్నారని వారు చెబుతున్నారు.
*రిస్క్ ఉంది – జర జాగ్రత్త:*
ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది వివాహాది శుభకార్యాల కోసం షాపింగ్ చేస్తున్నారు. అయితే బులియన్ మార్కెట్లో ఒడిదొడుకులు చాలా సహజం. అందుకే పెరుగుతున్న ధరలు మార్కెట్లో భయాన్ని కూడా సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అధిక ధరకు బంగారం కొన్నవారు, రేట్లు తగ్గిన తర్వాత ఇబ్బందిపడే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.


