ఆయన రాయలసీమకు చెందిన అధికారపార్టీ అయిన ‘టిడిపి’కి చెందిన కీలకమైన మంత్రి. అయితే తమ పార్టీ బద్దశత్రువైన మాజీ మంత్రి ‘ఆర్.కె.రోజా’ను ఆయన తన ఇంటికి ఆహ్వానించారని, ఆమెతో రాజకీయ చర్చలే కాకుండా..ఆమెకు సంబంధించిన పనులు కూడా చేసి పెట్టారట. ‘విజయవాడ’లోని సదరు మంత్రి ఇంటికి వైకాపాకు చెందిన మాజీ మంత్రి ‘రోజా’ వెళ్లడం..తరువాత ఆమె పనులు చకచక అవడం..రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’, ఆయన తనయుడు ‘లోకేష్’లపై ఒంటికాలితో విరుచుకుపడే..‘రోజా’ను ఆ మంత్రి ఎలా తన ఇంటికి రానిచ్చారనే దానిపై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. బద్దశత్రువును ఎలా రానిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ‘రోజా’ మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం..‘చంద్రబాబు’ను ‘లోకేష్’ను పరుషపదజాలంతో విమర్శలు చేసేది. ముఖ్యంగా ‘లోకేష్’ను వాడూ..వీడూ అంటూ నోరుపారేసుకుంది. అసెంబ్లీలో ‘చంద్రబాబు’ గురించి, ఆయన భార్య గురించి, ‘లోకేష్’ భార్య గురించి కూడా అసహ్యంగా మాట్లాడేది. దీంతో..ఆమె విమర్శలపై టిడిపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే..‘రోజా’ సంగతి చూస్తామని అప్పట్లో వారు..తెగ ఇదయ్యేవారు. కానీ..అధికారంలోకి వచ్చి పది మాసాలు అవుతున్నా..‘రోజా’ను ఇంత వరకు ఏమీ చేయలేకపోయామనే బాధ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఒకవైపు వాళ్లు ఇలా బాధపడుతుంటే మరోవైపు మంత్రులు అయినవారి ఆమెకు ఇంటికి ఆహ్వానాలు పంపుతున్నారట. రాయలసీమకు చెందిన ఈ మంత్రి వ్యవహారశైలిపై ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి ఆయన పట్ల ఎంతో ఔదార్యంతో వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేతను నీచంగా దూషించిన వారిని ఇంటికి ఎలా రానిస్తున్నారని, నైతికంగా, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటివి తగవని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.