ప్రమాదకరంగా ఏన్కూరు బ్రిడ్జి – ప్రజల ప్రాణాలతో చలగాటం
పట్టించుకోని అధికారులు, పెరుగుతున్న ప్రమాదాలు
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 12
ఏన్కూరు మండల పరిధిలో ఖమ్మం–భద్రాచలం ప్రధాన రహదారి మీద ఉన్న ఏన్కూరు బ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. వర్షాల కారణంగా బ్రిడ్జిపై నీరు నిల్వ ఉన్నా కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దాంతో వాహనదారులు ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేస్తున్నారు.
ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్తుంటాయి. రహదారి ఇరుకుగా ఉండటమే కాకుండా, బ్రిడ్జి మూలన మూడు అడుగుల వెడల్పుతో, అడుగు లోతులో పెద్ద గోవి ఏర్పడింది. ఆ గోవి కారణంగా వాహనాలు ఒక్కసారిగా తూలిపడే ప్రమాదం నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో దీపాల వెలుతురు తక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలుమార్లు ద్విచక్ర వాహనదారులు ఆ గుంటలో పడిపోయి గాయపడ్డ ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
వర్షాలు పడినప్పుడు బ్రిడ్జిపై నీరు నిల్వ కావడంతో మరింత ప్రమాదం పెరుగుతోంది. నీటి కింద ఉన్న గోతులు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు పలుమార్లు గ్రామ పంచాయతీ మరియు రోడ్డు విభాగం అధికారులకు విజ్ఞప్తి చేసినా, ఎటువంటి స్పందన లేకుండా అధికారులు మౌనంగా ఉన్నారు.
ప్రజల ప్రాణాలతో అధికారులు ఆటలాడుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రతిరోజూ ఇక్కడ ప్రమాదం తప్పదని తెలిసినా కూడా ఎవరూ చూడటంలేదు. కనీసం తాత్కాలిక మరమ్మతులు అయినా చేయాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సమీప కాలంలో ఈ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదాల కారణంగా ప్రజల్లో భయం నెలకొంది. వర్షాకాలం పూర్తిగా ముగియకముందే అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పౌరులు హెచ్చరిస్తున్నారు.
ప్రజల డిమాండ్ ఒకటే — “ఏన్కూరు బ్రిడ్జి మరమ్మతులు తక్షణమే చేయాలి, లేకపోతే పెద్ద ప్రాణ నష్టం తప్పదు.”


