-రైతు కుటుంబంలో పుట్టి, ఇంగ్లీషులో దారాళంగా మాట్లాడుతున్న సరస్వతీ పుత్రికలు
-కష్టేఫలి నిరూపణ: సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ ప్రశంస
చిట్వేలి, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే అంతర్జాతీయ అవకాశాలు దక్కవనే అపోహలను పటాపంచలు చేస్తూ, చిట్వేలికి చెందిన ఇద్దరు యువతులు తమ ప్రతిభతో ఏకంగా అమెరికన్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ అమ్మాయిలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే, వారు ఏదో ఖరీదైన ప్రైవేట్ లేదా కార్పొరేట్ సంస్థల్లో చదివి ఉంటారని అనుకుంటే, అది పొరపాటే. వీరు చదివింది చిట్వేలి జెడ్.పి.హెచ్.ఎస్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాత్రమే.
-సామాన్య కుటుంబం… అసామాన్య లక్ష్యం:
చిట్వేలి బ్రాహ్మణ వీధికి చెందిన చెంజి మనోహర (తండ్రి), విజయ (తల్లి) దంపతులకు ముగ్గురు సంతానం: నవీన, భార్గవి, బాలాజీ . రైతు కుటుంబంలో పుట్టిన ఈ ముగ్గురు పిల్లల ఉన్నత విద్యకు పునాది వేసింది ప్రభుత్వ పాఠశాలే.
నవీన చిన్నప్పటినుండి చదువులలో దిట్టగా ఉండి, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఆమె తన సోదరి భార్గవికి, తమ్ముడు బాలాజీకి చదువు పట్ల నిరంతరం ప్రోత్సాహం అందించేది.నవీన విద్యార్థి దశలో కరోనా విపత్తు కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఆమె కొన్నాళ్ళు వాలంటీర్ ఉద్యోగం చేస్తూనే, కరస్పాండెంట్స్ ద్వారా విద్యను కొనసాగించి ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి తిరుపతిలోని ఒకే కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.ప్రస్తుతం నవీన, భార్గవి ఇద్దరూ అమెరికన్ కంపెనీలో సైబర్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం చేస్తూనే, ప్రైవేటుగా ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్నారు. వారి తమ్ముడు బాలాజీ మధురైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
-తండ్రి పట్టుదలే ప్రధానం:
పిల్లల విజయం వెనుక తండ్రి చెంజి మనోహర కృషి ఎంతో ఉంది. చిన్ననాటి నుండి పిల్లలకు చదువుపై ఉన్న మక్కువను చూసి, ఎంత కష్టమైనా సరే ఉన్నత విద్యలు చదివించాలని ఆయన పట్టుబట్టారు. ఎప్పటికప్పుడు మిత్రులతో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకొని వాటిని కచ్చితంగా పాటించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
-ప్రశంసల వెల్లువ:
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, “కష్టేఫలి. కష్టాన్ని ఇష్టంగా చేస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని ఈ చిన్నారులు నిరూపించారు. నేటి సమాజంలో ఈ సరస్వతీ పుత్రికలు ఆదర్శంగా నిలిచారు” అని ప్రశంసించారు.వీరి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కొరకు అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులకు చిట్వేలి హెల్ప్ లైన్ సొసైటీ సేవా సంస్థ తరఫున మరియు చెంజి మనోహర మిత్రబృందం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.


