*ప్రజాస్వామ్య రక్షణ కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమం*
★ పీలేరులో రాహుల్ గాంధీకి మద్దతుగా పోస్ట్ కార్డు ఉద్యమం.
★ డిజిటల్ ఓటరు జాబితాను వెంటనే ప్రచురించాలి.
★ నకిలీ ఓటర్ల ద్వారా జరుగుతున్న ఓటు చోరిని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి.
★ NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల.అమృత్ తేజ డిమాండ్
పీలేరు,అన్నమయ్య జిల్లా:
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న “ఓట్-చోరీ” ఉద్యమానికి మద్దతుగా దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ ఆధ్వర్యంలో రాష్ట్రపతి గారికి పీలేరు పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం దగ్గర ఉన్న పోస్ట్ బాక్స్ ద్వారా పోస్ట్ కార్డులు పంపించారు.
ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ “ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది. కానీ నకిలీ ఓటర్ల ద్వారా జరుగుతున్న ఓటు చోరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది అని అన్నారు. ఓట్-చోర్ ని అరికట్టడానికి రాష్ట్రపతి గారు వెంటనే జోక్యం చేసుకుని డిజిటల్ ఓటరు జాబితాను ప్రచురించడమే కాకుండా, ఓటు చోరిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం మరియు రాజ్యాంగం ద్వారా ప్రజలు పొందిన ఓటు హక్కును కాపాడడానికి ఒక యోధుడిలా ఉద్యమానికి సిద్ధమయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్-చోర్ ఉద్యమానికి రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని తెలిపారు. రాహుల్ గాంధీ ఇంతకుముందు మీడియా సమావేశంలో ఓట్-చోర్ అంశం పై చూపించిన వాస్తవాలు ఆటంబాంబు లాంటివని మరికొద్ది రోజుల్లో హైడ్రోజన్ బాంబు లాంటి మరిన్ని ఆధారాలు ప్రజల ముందు పెట్టబోతునట్టు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యూ.ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ , లోకేష్, యశ్వంత్, మహేంద్ర, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.


