పున్నమి Daily న్యూస్
ప్రతినిథి:T.Ravinder
ఖమ్మం
ఖమ్మం, ఆగస్టు 28:
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రజల ఉద్దేశించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్న దృష్ట్యా పార్టీ కార్యకర్తలు తక్షణమే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
“వర్ష విపత్తు సమయాల్లో ప్రజల పక్కనే నిలబడి సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలి. అవసరమైతే రాత్రింబగళ్లు పనిచేసి బాధితులకు తోడ్పాటు అందించాలి” అని ఆయన కార్యకర్తలకు సూచించారు.
వాగులు పొంగిపొర్లుతున్నాయి – పంటలు జలదిగ్బంధం
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రహదారులు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పంట పొలాలు జలదిగ్బంధమై వేలాది ఎకరాల్లో పత్తి పంట తీవ్ర నష్టానికి గురైంది. గ్రామాలు, లోతట్టు కాలనీలు నీటమునిగి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వరద భయాందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించగా, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అవసరమైతే వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని నెల్లూరి కోటేశ్వరరావు సూచించారు.
అత్యధిక వర్షపాతం – గ్రామాలు చీకటిలో
సత్తుపల్లి మండలంలో 18 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవగా, కొనిజర్ల, మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షపు తీవ్రతతో రోడ్లు చెరువుల్లా మారి అనేక గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయమై, గ్రామీణ ప్రాంతాలు చీకటిలో మగ్గుతున్నాయి. తాగునీరు, పాల సరఫరా, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది.
ఈ తరుణంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండి, అప్రమత్తతతో వ్యవహరించాలని, సహాయక చర్యలకు కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని ఆయన మరొకసారి పిలుపునిచ్చారు.


