పేద,మధ్య తరగతి ప్రజలకు వరం
జీఎస్టీ సంస్కరణలపై ఎంపీ పురందేశ్వరి హర్షం
-ప్రధాని మోదీకి, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 22: జీఎస్టీ సంస్కరణలు పేద మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఒక వరమని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. స్థానిక దేవీచౌక్ లో శ్రీశ్రీశ్రీ బాల త్రిపుర సుందరీ దేవి 92వ దేవీ నవరాత్రి మహోత్సవాల ప్రారంభం సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. ఒకపక్క దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమైన వేళ, మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలు తీసుకు రావడం ఆనంద దాయకమన్నారు. శరన్నవరాత్రుల సమయంలో జీఎస్టీ తగ్గించి, ప్రజలకు మంచి చేసిన ప్రధాని మోదీ నిండు నూరేళ్లు అయోరారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు.
గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను విధానం ఉండేదని ఎంపీ పురందేశ్వరి గుర్తుచేసారు. అయితే దీనివలన పెట్టుబడులు పెట్టేవారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం గమనించి, ఒకే దేశం, ఒకే పన్ను విధానం కింద జిఎస్టీని 2017లో జులై 1న ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దీనివలన ఎంతో ప్రయాజనం చేకూరిందన్నారు. ఇప్పుడు జీఎస్టీ 2.0 ద్వారా నాలుగు స్లాబులున్న జిఎస్టీని రెండు స్లాబుల్లోకి తెచ్చారని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం గా జిఎస్టీని దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 5శాతం, 18శాతంగా రెండు స్లాబుల్లో పెట్టారని ఆమె తెలిపారు. దీనివలన ధరల పెరుగుదలను నియంత్రించుకునే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం కోసం వాడే పరికరాలు జీఎస్టీ సరళీకృతం వలన ధరలు తగ్గి, రైతులకు రాబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పురుగు మందులు, ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.
ఆరోజు నందమూరి తారకరామారావు మిల్లు ధరలకే నూలుని చేనేత వర్గాలకు అందించి, జనతా వస్త్రాలను ప్రవేశపెడితే, ప్రస్తుతం ప్రధాని మోదీ నూలుపై 18శాతం పన్నుని 5శాతానికి తగ్గించి, చేనేత రంగానికి సానుకూల ఫలాలు అందేలా చేశారని ఎంపీ పురందేశ్వరి అన్నారు. తినుబండారాలపై చాలావరకు జీఎస్టీ ఎత్తివేయడం వలన ఆహారం పేదలందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే జనఔషధి కేంద్రాలను ప్రవేశ పెట్టి మందులను పేదలకు అందుబాటులోకి తెచ్చారని, ఇప్పుడు కొన్ని మందులపై జీఎస్టీ ఎత్తివేసి మరింత చేరువ చేసారని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన చర్యల వలన 11వ ఆర్ధిక శక్తిగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చిందని, ఇప్పుడు మూడవ స్థానానికి రావడానికి ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో కూడా జీఎస్టీ తగ్గించారని, దీనివలన చిన్న కార్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పెద్ద కార్లకు 40శాతం డ్యూటీ తగ్గించడం వలన అవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్లెక్షీతో ప్రదర్శన చేసారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, పార్టీ నాయకులుఎపిఆర్ చౌదరి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, హీరాచంద్ జైన్, యానపు ఏసు, కాలెపు సత్యసాయి రామ్, పడాల శివ నాగరాజు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు


