పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25
“మానవ సేవయే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య సందేశాన్ని ఆచరణలో పెట్టుతూ, ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి భక్తులు నిరుపేద మహిళకు తగిన వైద్య సహాయం అందించారు.
విశాఖ జిల్లాలోని ఎల్లమంచిలిదొడ్డి గ్రామానికి చెందిన ఉరుకుటి లక్ష్మి అనే దినసరి కార్మికురాలు మూడు సంవత్సరాల క్రితం కాలికి అమర్చిన ఇనుపరాడ్ తొలగించడానికి శస్త్రచికిత్స అవసరమైంది. దానికి సుమారు ₹20,000 రూపాయలు అవసరం కావడంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు తీవ్ర కాలి నొప్పి ఎదుర్కొంటున్న ఆమె ఉక్కునగరం శ్రీ సత్య సేవా సమితి యూత్ కోఆర్డినేటర్ ప్రకాశ్‌ను సంప్రదించింది.
ఆమె పరిస్థితి తెలిసిన వెంటనే ప్రకాశ్ , ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి సేవా విభాగం కోఆర్డినేటర్ పద్మ తో కలిసి ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో సేవ చేస్తున్న రత్నం సిస్టర్‌ను సంప్రదించారు. ఆమె సహకారంతో శస్త్రచికిత్స విజయవంతంగా ఉచితంగా పూర్తయింది.
శస్త్రచికిత్సకు కావలసిన సామగ్రి కోసం శ్రీ సత్య సాయి భక్తురాలు త్రివేణి, శ్రీ సత్య సాయి మందిరం కాంట్రాక్టర్ అనిల్, ప్రకాశ్ లు ఆర్థిక సహాయం అందించారు. భగవాన్ బాబా దివ్య బోధనలకు ప్రేరణగా ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా భక్తులు చేసిన సహాయానికి ఉరుకుటి లక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా “అందరినీ ప్రేమించండి – అందరినీ సేవించండి ” అన్న భగవాన్ సందేశం మరొకసారి ప్రతిధ్వనించింది.


