*పేదల గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి*
*అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి *:- పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై హౌసింగ్ అధికారులు, స్పెషల్ అధికారులు, జోనల్ కమిషనర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ దశలలో ఉన్న పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు. మార్చి 2026 నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయవలసి ఉన్నందున సంబంధిత అధికారులంరూ పేదల గృహ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజుకు 200 ఇళ్ల చొప్పున పూర్తి చేసి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మార్చినాటికి పూర్తి చేసుకోకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. అదనపు ఆర్థిక సహాయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్ కమిషనర్లు పురోగతిపై దృష్టి పెట్టాలని, ప్రతి సచివాలయంలో జియో ట్యాగింగ్ పూర్తి చేయుటకు ప్రణాళిక రూపొందించాలని, లక్ష్యసాధనలో వెనుకబడిన వారిపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సమావేశంలో హౌసింగ్ పీడీ సత్తిబాబు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, హౌసింగ్ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


