*పులస కోసం కర్ణాటక నుంచి కడియం వచ్చిన*
*ఈ పెద్దాయన ఎవరో తెలుసాండీ..?*
ఏడేళ్ల క్రితం ఇదే రోజు కడియం వెళుతూ పల్ల వెంకన్న గారి నర్సరీ వద్ద ఆగాను. అక్కడ ఎవరున్నా లేకపోయినా వెంకన్న గారి పెద్దబ్బాయి సత్తిబాబు గారు ఉంటారు. ఆయనతో కలసి గ్రీన్ టీ లేదా కొబ్బరి బొండం తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకోవడం అలవాటు. ఆరోజు ఆ నర్సరీలో ఓ పక్కన మొక్కలు చూస్తున్న ఓ వ్యక్తిని చూపించి ఆయనెవరో తెలుసా అని సత్తిబాబు గారు అడిగారు. ఆయన్ని ఎక్కడా చూసినా సందర్భం లేదన్నాను. ఆయన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ అన్నారు. బహుశా మాజీ అనుకున్నాను. ఎందుకంటే ఆ చుట్టుపక్కల పోలీసులు, అధికారులు వంటి వారు ఎవరూ లేరు. కూడా వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరని ఉంచాలని పెద్ద రాద్దాంతాం జరుగుతున్న రోజులవి.ప్రస్తుత స్వీకర్ ఆయనేని చెప్పడంతో ఆశ్చర్యం కలిగి తాగుతున్న టీ కప్పును పక్కనపెట్టి ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసాను. ఆయనే….స్పీకర్ కుర్చీలో ఉండి మాట్లాడడం చూసి మతిపోయింది. కర్ణాటక అంతటి పెద్ద రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అంత సింపుల్ గా ఉన్నారేటని ఆశ్చర్యపోయాను.ఆయన వస్తున్నట్లు సమాచారం ఇస్తే మన ప్రభుత్వం ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తుంది.
సత్తిబాబు గారు ఆయన వద్దకు తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు. ఆయన అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారు.పేరు కాళ్లకూర రమేచ్ కుమార్. 1978 నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు వివరించారు. రెండుసార్లు అసెంబ్లీ స్పీకర్ గా, మరో రెండు సార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసినట్లు తెలిపారు. కన్నడ బ్రాహ్మణులు. ఆయన సామాజిక వర్గం ఓట్లు అయిదు శాతం కూడా ఉండని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నట్లు తెలిపారు. అంటే ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు స్పష్టమవుతుంది. ఇన్ని పదవులు చేపడుతున్న మీరు ఇలా సెక్యూరిటీ లేకుండా రావడం ఏమటని అడగ్గా నాకు శత్రువులు ఎవరూ లేరని అయినా నా వ్యక్తిగత పనిమీద ఇక్కడికి వచ్చినప్పుడు సెక్యూరిటీలు వినియోగించుకోవడం ఇష్టం లేదని చెప్పారు. ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకి వెళ్తుంటానని వివరించారు.పల్ల వెంకన్న గారితో తనకు ఎప్పుటి నుంచో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఉన్న అభిమానంతో ఇక్కడికి తరుచూ వస్తుంటానని తెలిపారు.చాలా ఆశ్చర్యం కలిగింది.
ఇంతలో నర్సరీకి కారు వచ్చి ఆగింది. ఆ కారు శబ్దం కంటే అందులో ఉన్న వ్యక్తి మాటల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. అంటే పల్ల ఎంకన్న గారు వచ్చారన్నమాట.అక్కడ పనిచేసే వారంతా అటెక్షన్ లోకి వెళ్ళిపోయారు. ఆయనతో మామూలుగా ఉండేది కాదు. ఆయన్ని చూడగానే స్పీకర్ గారు ఆయన వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. నేను మాత్రం కొంచెం దూరంగానే ఉన్నాను. ఎందుకంటే వెంకన్న గారితో పడలేను. రాజకీయాలు ఎలా ఉన్నాయి అబ్బాయి అంటారు. కాంగ్రెస్ పార్టీ బాగుంది అంటేనే ఒప్పుకుంటారు. లేకపోతే చివాట్లు పెడతారు. అందుకనే ఆయనతో రాజకీయం చర్చించడం చాలా కష్టం.నికార్సైన కాంగ్రెస్ వాది.
స్పీకర్ గారితో ఓ సెల్పీ తీసుకుని వచ్చేస్తూ సత్తిబాబు గారితో అన్నాను గట్టిగానే ఆయన మొక్కలు కొని ఉంటారని.అప్పుడు చెప్పారు అసలు విషయం. ఆయన మొక్కలు కోసం రాలేదు పులస భోజనం కోసం వచ్చారని.ఇంటి దగ్గర వండించి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అదేంటి ఆయన బ్రాహ్మణులు అన్నారు కదా అన్నాను.అవును కాని పులస చేప అంటే ఇష్టం అని చెప్పారు.చూసారా…గోదావరి పులస మహత్యం.ఇప్పుడు పులసలూ లేవు పల్ల వెంకన్న గారూ లేరు.
మరో విశేషం ఏంటంటే ఇటువంటి ప్రముఖులు చాలా మంది కడియం నర్సరీలకు వస్తుంటారు. కొందరు మాత్రమే తాము వచ్చినట్లు తెలియజేయడానికి అంగీకరిస్తారు.అప్పుడు కూడా ఆయన వచ్చినట్లు పేపర్లో రాయవద్దని చెప్పారు. ప్రస్తుతం ఆయన పదవిలో లేనందున ఆనాటి జ్ఞాపకాలు ఇలా మీ ముందుంచాను

