మున్సిపల్ కార్యాలయం, మంగళవారం :
నిరుపేద కుటుంబాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) 2.0 కింద మంజూరైన గృహ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఒక ప్రాథమిక హక్కు. ఈ పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి” అని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు.
ఇళ్ల నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులను నాలుగు విడతలుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వివరించారు. పునాది వేసిన తర్వాత మొదటి విడత, రూఫ్ లెవల్ దాకా నిర్మాణం పూర్తయినప్పుడు రెండో విడత, ఇంటి నిర్మాణం పూర్తయి కిటికీలు–తలుపులు అమర్చిన తర్వాత మూడో విడత, నివాసయోగ్యంగా పూర్తిగా సిద్ధమైన తర్వాత నాల్గవ విడత విడుదల అవుతుందని తెలిపారు.
నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేందుకు ఈ దశలవారీ విధానం ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర పేర్కొన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు, కమిషనర్, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, పీఎంఏవై లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


