*పిల్లల ఆకలి తీర్చడానికి ఓ చిన్న ప్రయత్నం…”మార్నింగ్ న్యూట్రిషన్”*
*అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్
*విశాఖపట్టణం పున్నమి ప్రతినిధి:- * ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల చిన్నారుల కోసం మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేస్తోందని… దానికి అనుబంధంగా వారంలో మూడు రోజుల పాటు ఉదయం పూట అందించేందుకు గాను “మార్నింగ్ న్యూట్రిషన్” పేరుతో ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోకుండా తరగతులకు వచ్చిన విద్యార్థులను గమనించినప్పుడు కొంచెం బాధ కలిగిందని, అప్పుడే వారి కోసం ప్రత్యేకంగా బలవర్ధక ఆహారం అందించాలని నిర్ణయించుకున్నామని, అక్షయపాత్ర ఫౌండేషన్ వారిని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని గుర్తు చేసుకున్నారు. వారి సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు ఉదయం పూట అందించేందుకు ఉద్దేశించిన మార్నింగ్ న్యూట్రిషన్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్ మీటింగు హాలులో ప్రారంభించిన సమయంలో ఆయన పైమేరకు స్పందించారు. తొలి విడతలో 178 పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేస్తామని, రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు అందిస్తామని పేర్కొన్నారు. దీనిలో తన పాత్ర పెద్దగా ఏమీ లేదని, అక్షయపాత్ర వారి పెద్ద మనసు ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ముందుగా పిల్లల చేత బలవర్ధక పదార్థాలనున్న బాక్సులను ఓపెన్ చేయించిన ఆయన వారికి అందులో పదార్థాలను అందజేశారు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో మరెక్కడా లేదని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో విశాఖపట్టణం జిల్లాలో మాత్రమే అమలు చేస్తున్నామని డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్ ఈ సందర్బంగా తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


