రైతు గంగాధర్ పరిస్థితి విషమం
తాడిపత్రి, శుక్రవారం: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో పవర్ గ్రిడ్ అధికారులు నిర్వహిస్తున్న టవర్ ఏర్పాటుపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులతో చర్చించకుండా, వారికి అందాల్సిన పరిహారం కన్నా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ టవర్లను బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేడ్కరిస్ట్) అనంతపురం జిల్లా అధ్యక్షుడు వీర నాగరాజు మాట్లాడుతూ, “పవర్ గ్రిడ్ అధికారుల నిరంకుశ చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. రైతులను నష్టపరిచే ఈ ప్రాజెక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము” అని పేర్కొన్నారు.
అధికారుల వ్యవహారశైలి వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన రైతు గంగాధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు, గ్రామస్థులు స్పందించి అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
గ్రామంలో ఈ ఘటన కలకలం రేగించగా, రైతులు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు టవర్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.


